kosigi

సీమగర్జన పేరుతో రాయలసీమ ప్రజలకు చెవిలో పువ్వులు పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం – AIYF

సీమగర్జన పేరుతో రాయలసీమ ప్రజలకు చెవిలో పువ్వులు పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం – AIYF

కోసిగి (పల్లెవేలుగు) 04 డిసెంబర్: ఈ నెల 5వ తేదిన జరుగుతున్న సీమగర్జన పేరుతో రాయలసీమ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం చెవిలో పువ్వులు పెడుతుందని *అఖిల భారత యువజన సంఘం (AIYF) జిల్లా నాయకులు ఎం. రాజు అన్నారు. ఈ సంద్భంగా ఆయన స్థానిక సీపీఐ కార్యాలయంలో మాట్లాడుతూ రాయలసీమ అభివృద్ధి అంటే కేవలం హైకోర్టు మాత్రమే కాదని వాటితో పాటు కడప ఉక్కు ఫ్యాక్టరీ, రాయలసీమ యూనివర్సిటీ, అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ నిధులు కోసం గర్జించాలని ఆయన అన్నారు. అలాగే హంద్రీనీవా కాలువ వెడల్పుతో పాటు, వేదవతి గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఏమి చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రాయలసీమలో 49 ఎమ్మెల్యేలు 8 ఎంపీలను గెలిపించినా రాయలసీమ అభివృద్ధి పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం మంచిది కాదన్నారు. రాయలసీమలోని యువత ఇతర ప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్తున్నారని వీటి పైన ప్రజాప్రతినిధులు ఎందుకు దృష్టి పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో హై కోర్ట్ అమరావతిలోనే వుంటుంది అని చెబుతారని, రాయలసీమ ప్రాంతంలో  సీమగర్జన అని గోల చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. అసలు సీమగర్జన అనేది ప్రతిపక్షాలపైనా..? లేక ప్రజాసంఘాల పైనా..? ఎవరి పైన గర్జిస్తారో చెప్పాలని వారు ప్రశ్నించారు. ఈ ప్రాంతం నుంచే రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ఈ ప్రాంత అభివృద్ధికి అవసరమైన  చర్యలు తీసుకోలేకపోవడం చాలా బాధాకరమని వారు అన్నారు. ఈనెల 5న నిర్వహించే సీమగర్జనలో రాయలసీమ ప్రాంతానికి ఉపయోగపడే విధంగా చర్చించాలని, కేవలం రాజకీయ లబ్ధి కాకుండా ప్రజల అజెండాతో మాట్లాడాలని వారు కోరారు. సీమ గర్జన పేరుతో మరోసారి ప్రజలను మోసం చేస్తే తిరుగుబాటు తప్పదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యువకులు జీవన్, వీరెష్, అనిల్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Mohammad Yousuf

Mohammad Yousuf Reporter, Kosigi, Kurnool DIst
Back to top button