
విద్యారంగ సమస్యలను పరిష్కారించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం -పి.డి.ఎస్.యు.
విద్యారంగ సమస్యలను పరిష్కారించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం -పి.డి.ఎస్.యు.
నంద్యాల (ఆంధ్రప్రతిభ)17 ఆగష్టు: రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షులు ఎస్.ఎండి రఫీ, జిల్లా కార్యదర్శి కె.నాగరాజు బాష అన్నారు. మంగళవారం నాడు నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పి.డి.ఎస్.యు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షులు ఎస్.ఎండి రఫీ,జిల్లా కార్యదర్శి కె.నాగరాజు మాట్లాడుతూ జిల్లాలో విద్యారంగ సమస్యలు పుట్టగొడుగుల్లా పుట్టుకువస్తున్న వాటిని పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పాటు విద్యాశాఖ అధికారులు పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలో3,4,5 తరగతులు ఇతర పాఠశాలల్లో విలీనం చేయడంతో గ్రామీణ పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నూతన జాతీయ విద్యావిధానాన్ని అమలు చేసి విద్యను కాషాయకరణ చేస్తున్నారని విమర్శించారు. పాఠశాలలు ప్రారంభమై నేటికి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటికి వరకు పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు అందలేదని అన్నారు. జిల్లాలో మధ్యాహ్నం భోజనం పథకంలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో విద్యార్థుల పడుతున్న అవస్థలు ఈ విద్యాశాఖ అధికారులకు కనిపించలేదా అని ప్రశ్నించారు. కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల్లో విచ్చలవిడిగా అనేక పేర్లతో ఫీజులు వసూళ్ళు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వాటిని అరికట్టేందుకు కనీస చర్యలు చేపట్టకపోవడం దారుణమన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 7000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బైజుస్ డిజిటల్ సంస్థతో చేసుకున్న రహస్య ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే విద్యార్థులకు ఉచిత ట్యాబ్ లను అందించాలని కోరారు.అనంతర జిల్లా విద్యాశాఖ ఆసిస్టెంట్ డైరెక్టర్ అనురాధ కి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. వాటిని త్వరలో పరిష్కరించకపోతే పి.డి.ఎస్.యు ఆధ్వర్యంలో ఉద్యమాలను ఉదృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు నంద్యాల డివిజన్ అధ్యక్ష,కార్యదర్శులు దస్తగిరి, నవీన్, ఉపాధ్యక్షులు నానీ, కళ్యాణ్, రాజేష్, సహాయ కార్యదర్శులు విజయ్, జిలానీ, నరసింహులు, నాయకులు మోహన్, ప్రసాద్, చంద్ర, మనోహర్, జావేద్, ఫరూక్, అజిజ్, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.