
రజకులకు సమావేశం భవనానికి స్థలాన్ని కేటాయించాలి – రాష్ట్ర అధ్యక్షుడు నందవరం శ్రీనివాసులు
రజకులకు సమావేశం భవనానికి స్థలాన్ని కేటాయించాలి – రాష్ట్ర అధ్యక్షుడు నందవరం శ్రీనివాసులు
నంద్యాల జిల్లా (ఆంధ్రప్రతిభ) 02 ఆగష్టు: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం రజకులకు సమావేశ భవనం కోసం స్థలాన్ని కేటాయించాలని ఏపీ రజక ఎస్సీ సాధన చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు నందవరం శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. నంద్యాల జిల్లా కేంద్రంలో రజకుల సమావేశ భవనానికి స్థలాన్ని కేటాయించాలని కోరుతూ నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు సోమవారం స్పందన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య కు వినతిపత్రాన్ని ఏపీ రజక ఎస్సీ సాధన చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు నందవరం శ్రీనివాసులు వినతి పత్రాన్ని అందజేశారు.ఈసందర్బంగా అయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో రజకులు ఆత్మీయ సమావేశాలు జరుపుకోవాలనుకుంటే ఇతర భవనాలకు వేలరూపాయలు ఇచ్చి సమావేశాలు జరుపుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని, సమావేశ భవనాలు లేక రజకులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. 2019 ఎన్నికల ముందు పాదయాత్రలో ప్రతిపక్ష నేతగా కులవృత్తులు చేసుకునే వారికి మన వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 50 సంవత్సరాలకే మూడు వేల రూపాయల పింఛను ఇస్తానని హామీ ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక పూర్తిగా మరిచి పోయారని ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కులవృత్తి చేసుకుంటూ జీవనం చేసుకుంటున్న రజకులకు 50 సంవత్సరాలకే వృద్దాప్య పింఛను ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిదంగా మన రాష్ట్రంలో వివిధ జిల్లాలలోని గ్రామాలలో కుల వృత్తి చేస్తున్న రజకులు సంవత్సరానికి మేర పెంచాలని కోరితే గ్రామ బహిష్కరణలు, రజకుల పై దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకోసమే, రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా మంత్రులు, అధికారులు వెంటనే చర్యలు తీసుకొని రజకులకు ఒక రక్షణ చట్టాన్ని ఆమలు చేయాలని కోరారు. నిరుపేద రజకులకు నివసించేందుకు ఇళ్ళులేక బాడుగలు కట్టలేక అవస్థలు పడుతున్నారు. కాబట్టి రజకులకు రెండు సెంట్ల ఇంటి స్థలాలను ఇవ్వాలని కోరారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రజక కుల సమావేశం భవనం కోసం స్థలాన్ని కేటాయించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు ఎం.వి రమణ, సి.శ్రీనివాసులు, ఓబులంపల్లె నరసింహ, సుబ్బయ్య, తదితరులు పాల్గొన్నారు.