
మానవతా-నైతికత ఉద్యమం నంద్యాలలో లాంఛనంగా ప్రారంభం
మానవతా-నైతికత ఉద్యమం నంద్యాలలో లాంఛనంగా ప్రారంభం
నంద్యాల (పల్లెవేలుగు) 10 ఫెబ్రవరి: ప్రముఖ సామాజిక ఆధ్యాత్మిక సంస్థ అయిన జమాఅతె ఇస్లామి హింద్ రాష్ట్ర వ్యాప్తంగా ‘మానవత నైతికత’ అనే నినాదంతో జాగరణ ఉద్యమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా నంద్యాలలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో స్దానిక అధ్యక్షులు షేక్ అబ్దుల్ సమద్ మాట్లాడుతూ నేడు మనిషి వైజ్ఞానిక అభివృద్ధిలో దూసుకుపోతున్నాడు, కానీ మానవతా విలువలు నానాటికి దిగజారుతున్నాయి. సమాజంలో పెరిగిపోతున్న నేరాలు, మారణహోమాలే దీనికి ప్రత్యేక సాక్షాలు అని తెలిపారు. ఈ నేపధ్యంలో మనిషిలో నైతిక పరివర్తన కలిగినపుడే మానవతా విలువలు వికసిస్తాయని, దైవభీతి, జవాబుదారీతనం వల్లానే మనుషిలో నైతికత జనిస్తుందని అన్నారు. సమాజంలో ఈ భావనను పెంపొందించే ఉన్నత లక్ష్యంతోనే జమాఅతె ఇస్లామి హింద్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా “మానవత – నైతికత” జాగరణ ఉద్యమాన్ని ఈ నెల 11 నుండి 20 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మానవత్వం, సత్యం ఆధారంగానే మానవాళిని దైవం సృష్టించాడని, దేవుని దృష్టిలో మానవ ప్రాణం అత్యంత విలువైనదని, నైతికత, మానవత్వం ఆధారంగానే మనిషికి స్వర్గ నరకాల ప్రాప్తి ఉంటుందనే విశ్వమానవ సౌభ్రాతృత్వ సందేశాన్ని ఈ సందర్భంగా తెలియజేయనున్నామని ఆయన తెలిపారు. ఉద్యమంలో భాగంగా సామజిక, రాజకీయ, వివిధ ప్రత్యేక రంగాల్లో ప్రముఖులతో సమావేశాలు, వివిధ మతాల ఆధ్యాత్మిక గురువులతో చర్చగోష్టులు, కరపత్రాలు, పోస్టర్ల పంపిణీ, సోషల్ మీడియా ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కరపత్రాలు విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో సీ.యం.జకరియా,మోమీన్ గౌస్, అబ్దుల్ ఖాదర్ జీలాని, వి.సలీం, అబ్బాస్ అలీ, అబుబకర్ సిద్దీఖ్, జైనుల్లా పాల్గొంటున్నారు .