
మంత్రి జయరాం అనుచరుడు వీరేష్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి
మంత్రి జయరాం అనుచరుడు వీరేష్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి
- కోసిగిలో ఏపీయూడబ్ల్యూజే ధర్నాకు మద్దతు తెలిపిన టిడిపి, సిపిఎం, సిపిఐ, ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ప్రజా సంఘాల నాయకులు
కోసిగి (పల్లెవేలుగు) 13 ఫెబ్రవరి: మంత్రి గుమ్మనూరు జయరాం అనుచరుడు ఆలూరు వైసీపీ మండల కన్వీనర్ వీరేష్ పై తక్షణమే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఏపీయూడబ్ల్యూజే జిల్లా సహాయ కార్యదర్శి బి.హనుమేష్ డిమాండ్ చేశారు. ఏపీయూడబ్ల్యూజే నాయకులు షబ్బీర్, శ్రీరాములు, గడ్డం ఈరన్న, ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం కోసిగి తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఏపీయూడబ్ల్యూజే యూనియన్ ధర్నాకు మద్దతుగా టిడిపి మండల కన్వీనర్ జ్ఞానేశ్, ఎంపిటిసి రాజు, చింతలగేని నరసరెడ్డి, మహాదేవ, సిపిఎం నాయకులు రాముడు, సిపిఐ నాయకులు తాయన్న, ఉల్లిగయ్య, ఏఐవైఎఫ్ నాయకులు రాజు, ఏఐఎస్ఎఫ్ నాయకులు ఈరేష్, ఎస్ఎఫ్ఐ నాయకులు రాజు, ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నాయకులు నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆలూరులో వైసీపీకి చెందిన కొంతమంది అధికార పార్టీ నేతలు చెరువు భూమిని ఆక్రమించి చదును చేసి ఫ్లాట్ వేయడానికి ప్రయత్నిస్తున్నారని ఈ విషయమై ఆంధ్రజ్యోతి పత్రికలో బ్యూరో కొండప్ప అక్కడ జరిగిన సమాచారం ప్రకారం పత్రికల్లో ప్రచురించడం జరిగింది. అయితే ఏమైనా ఇబ్బందులు ఉంటే న్యాయపరంగా చూసుకోవాలి కానీ జర్నలిస్టుల పైన ఎదురుదాడికి దిగడమే కాకుండా ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణను, బ్యూరో కొండప్పను బండికి కట్టుకొని ఈడ్చుకు వెళ్తామని ఆలూరు వైసిపి మండల కన్వీనర్ వీరేష్ ఓ వీడియోలో మాట్లాడుతూ హెచ్చరించడం చాలా సిగ్గుచేటు అన్నారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా సహాయ కార్యదర్శి హనుమేష్ మాట్లాడుతూ నిజాలను నిర్భయంగా రాస్తే బెదిరింపులకు పాల్పడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఇటీవల కాలంలో ఈ సంస్కృతి పెరిగిపోయిందని నిజాలు రాసే జర్నలిస్టుల పైన దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులు పెరిగిపోతున్నాయి అన్నారు. గతంలో ఇదే ఆలూరులో వైసిపి నాయకులు సూర్య, ప్రజాశక్తి రిపోర్టర్ల పై దాడి చేసిన సంగతి తెలిసిందే ఈ ఘటన మరువక ముందే మళ్లీ మంత్రి అనుచరులు ఆంధ్రజ్యోతి యాజమాన్యం ను బ్యూరోపై బెదిరింపులకు పాల్పడడం దారుణం అన్నారు. నిజాలు వెలుగులోకి రాకపోతే రౌడీలు, గుండాలు, ఫ్యాక్షనిస్టుల అవినీతి అక్రమార్కులదే రాజ్యమవుతుందన్నారు. ప్రజాస్వామ్యం బతికి బట్ట కట్టాలి అంటే మీడియాకు స్వేచ్ఛ ఉండాలన్నారు.కనుక ఆంధ్రజ్యోతి ఎండి, బ్యూరోపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసిపి ఆలూరు మండల కన్వీనర్ వీరేష్ పైన తక్షణమే జిల్లా పోలీస్ యంత్రాంగం కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసిల్దార్ రుద్రగౌడ్ కు ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్ట్ నాయకులు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే నాయకులు నాగేష్, నాగరాజు, రాజేష్, కర్రెప్ప, ప్రవీణ్, లక్ష్మన్న, జీవన్, ప్రభాకర్,యూసఫ్, మహమ్మద్, రఘు ప్రజా సంఘాల నాయకులు ఉన్నారు.