Dewanakonda

డిసెంబర్ 16 నుండి 20వ తేదీ వరకు చేపట్టబోయే రైతు రక్షణ కాలినడక పాదయాత్రలు జయప్రదం కోసం వాల్ పోస్టర్లు ఆవిష్కరణ

  • డిసెంబర్ 16 నుండి 20వ తేదీ వరకు చేపట్టబోయే రైతు రక్షణ కాలినడక పాదయాత్రలు జయప్రదం కోసం వాల్ పోస్టర్లు ఆవిష్కరణ
  • రైతుల భవిష్యత్తుకు పంటల భీమా పథకాన్ని పూర్తిస్థాయిలో వర్తింప చేయాలి

దేవనకొండ:   రైతుల భవిష్యత్తుకు పాలక ప్రభుత్వాలు చట్టపరమైన రక్షణ కల్పించాలని కోరుతూ డిసెంబర్ 16 నుండి 20 వరకు చేపట్టబోయే రైతు రక్షణ కాలినడక పాదయాత్రలు జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యులు కె.మద్దిలేటిశెట్టి, ఏపీ రైతుసంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎమ్.జగదీష్, సిపిఐ మండల ప్రధాన కార్యదర్శి ఎం. నరసరావు లు తెలిపారు. శనివారం సిపిఐ,ఏపీ రైతుసంఘం ఆధ్వర్యంలో సిపిఐ పట్టణ కార్యదర్శి ఎమ్. నెట్టేకళ్ళు అధ్యక్షతన మండల కేంద్రమైన దేవనకొండ నందు రైతు రక్షణ కాలినడక పాదయాత్రల వాల్ పోస్టర్లు లను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు, వ్యవసాయ రంగానికి మంచి భవిష్యత్తు ఉండాలంటే రైతుకు రక్షణ తప్పనిసరిగా ఉండాలన్నారు. ఖరీఫ్ సీజన్లో రైతులు వేసుకున్న పంటలు అధిక వర్షాల కారణంగా లక్షల ఎకరాల్లో నష్టం జరిగి పంట చేతికి రాలేదన్నారు. అలాగే నకిలీ పత్తి విత్తనాల వల్ల రైతులు ఎకరాకు లక్ష రూపాయల దాకా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, జిల్లా వ్యవసాయ అధికారులు జిల్లాలో పంటలు బాగా పండాయని చెప్పడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. జిల్లాలో అధిక వర్షాలు, నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. బ్యాంకుల్లో రైతులు తీసుకున్న అప్పులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రబీ సీజన్లో రైతులు వేసుకున్న పంటలు కాపాడుకునేందుకై హంద్రీనీవా ద్వారా మార్చి చివరి దాకా సాగునీరు అందించాలని కోరారు. పంటల భీమా పథకాన్ని పూర్తిస్థాయిలో వర్తింప చేయాలన్నారు.

Back to top button