
కేంద్ర ప్రభుత్వం మైనార్టీ విద్యార్థులకు స్కాలర్షిప్పులు రద్దు చేయడం తగదు – ఐటా
కేంద్ర ప్రభుత్వం మైనార్టీ విద్యార్థులకు స్కాలర్షిప్పులు రద్దు చేయడం తగదు – ఐటా
కడప (పల్లెవేలుగు) 01 డిసెంబర్: కేంద్ర ప్రభుత్వం 1 నుంచి 8వ తరగతి మైనారిటీ విద్యార్థులకు అందిస్తున్న ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ లను ఉన్నట్లుండి రద్దు చేయడం అత్యంత శోచనీయమని, దారుణమని ఆల్ ఇండియా ఐడియల్ టీచర్స్ అసోసియేషన్ (ఐటా) రాష్ట్ర అధ్యక్షులు ఎస్.అబ్దుల్ రజాక్ మరియు జిల్లా అధ్యక్షులు ఎస్.నజీర్ బాషా ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఒక సంయుక్త ప్రకటనలో తెలియజేసినారు. “ది ప్రైమ్ మినిస్టర్స్ న్యూ 15 పాయింట్ ప్రోగ్రాంలో” (THE PRIME MINISTER’S NEW 15 POINT PROGRAMME) భాగంగా కేంద్ర ప్రభుత్వం 1 నుండి 10 తరగతి చదివే మైనార్టీ విద్యార్థుల అభ్యున్నతి కొరకు జూన్ నెల, 2006వ సంవత్సరంలో ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ స్కీమ్‌ను ప్రారంభించింది. అర్హులైన మైనార్టీ విద్యార్థులకు వెయ్యి రూపాయల నుండి ఆరు వేల రూపాయల వరకు వస్తాయి. ఈ విద్యాసంవత్సరం దేశవ్యాప్తంగా మైనారిటీ విద్యార్థులకు దరఖాస్తు చేసుకోవడానికి 3 నెలల సమయం ఇచ్చి అందరూ దరఖాస్తు చేసుకున్న తర్వాత గడువు ముగిసిన తర్వాత ఉన్నట్లుండి RTE-2009 యాక్ట్ ను సాకుగా చూపించి ఎనిమిదో తరగతి వరకు మైనారిటీ స్కాలర్షిప్ ను రద్దు చేయడం తగదని తెలియజేసినారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది మైనార్టీ విద్యార్థులు దరఖాస్తు చేసుకొనుటకు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మొదటిసారి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు వెయ్యి రూపాయల నుండి మూడువేల రూపాయల వరకు వెచ్చించి బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ ప్రకారము ఒక్క మన రాష్ట్రంలోనే 2,97,427 మంది మైనారిటీ విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు ఇదంతా వృధా అయినది. 2009 వ సంవత్సరం నుండి ఆర్.టి.ఈ. యాక్ట్ అమలులో ఉన్నప్పటికీ మైనారిటీలకు స్కాలర్షిప్పులు ఇస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఉన్నట్లుండి ఎందుకు రద్దు చేయవలసి వచ్చిందో ఎవరికీ అర్థం కాని విషయం. కావున వెంటనే ఎనిమిదో తరగతి వరకూ మైనారిటీ స్కాలర్షిప్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వాపసు తీసుకుని, దరఖాస్తు చేసుకున్న ప్రతి మైనారిటీ విద్యార్థికి స్కాలర్షిప్ ను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయాలని ఐటా గట్టిగా డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా ఈ విషయంలో మన రాష్ట్ర ప్రభుత్వము మరియు మైనారిటీ మంత్రివర్యులు వెంటనే జోక్యం చేసుకుని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మైనారిటీ విద్యార్థులకు తగు న్యాయం చేయవలసినదిగా ఐటా మనవిచేస్తున్నది.