
Dewanakonda
అధిక వర్షాల వల్ల,కల్తీ విత్తనాలు, ఎరువుల వల్ల నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలి..
అధిక వర్షాల వల్ల,కల్తీ విత్తనాలు, ఎరువుల వల్ల నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలి..
దేవనకొండ ఇటీవల కురిసిన అధిక వర్షాల వల్ల నష్టపోయిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని, నవంబర్ 7వ తారీఖున జిల్లా వ్యాప్తంగా సచివాలయాల ముందు జరిగే ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే. మద్దిలేటి శెట్టి, సిపిఐ మండల కార్యదర్శి ఎం. నరసరావు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం సిపిఐ పట్టణ సమితి కార్యదర్శి ఎం.నెట్టేకల్ ఆధ్వర్యంలో కరపత్రాలు పంచుతూ దేవనకొండ లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అధిక వర్షాల వలన సాగు చేసిన పంటలు చేతికొచ్చే సమయంలో తీవ్రంగా నష్టం జరిగితే వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు ఏమాత్రం నష్టం జరగలేదని రిపోర్టు ఇవ్వడం బాధాకరమైన విషయం అన్నారు. క్షేత్రస్థాయిలో పంట పొలాలను పరిశీలించిన ఏ ఒక్క అధికారి కూడా ఇంత వరకు కనిపించలేదన్నారు. రైతులకు జరిగిన పంటల నష్టాన్ని అంచనా వేయడంలో కూడా అధికారులు మీనమేషాలు లెక్కించడం బాధాకరమన్నారు. ఉల్లి, మిరప పంటలకు ఎకరాకు 60 వేలు, పత్తి, వేరుశనగ, టమోటా, ఆముదం తదితర పంటలకు ఎకరాకు 40 వేలు పరిహారంగా ఇవ్వాలని, తక్షణమే హంద్రీ పరివాహక ప్రాంతాల నందు పంటలు నీట మునిగి తీవ్ర నష్టం జరిగిన రైతులను గుర్తించి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని అన్నారు. అలాగే పంటల బీమా పథకం పూర్తి స్థాయిలో వర్తింపచేసి బీమా డబ్బులు వెంటనే విడుదల చేయాలన్నారు. 2022 ఖరీఫ్ నందు రైతులు తీసుకున్న అప్పులు మాఫీ చేయాలన్నారు. నకిలీ విత్తనాలు వేసి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.